: అంతా నకిలీమయం... కలకలం రేపుతున్న ప్లాస్టిక్ గుడ్లు!
కల్తీ, నకిలీ ఆహార పదార్థాలు కలకలం రేపుతున్నాయి. ఏ పదార్థం కొనుక్కుని తిందామన్నా అది సరైనదేనా? అని ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆవాల నుంచి ఆనపకాయ వరకు అన్నింట్లోనూ కల్తీ రాజ్యమేలుతోంది. ప్లాస్టిక్ బియ్యాన్ని కూడా విక్రయానికి ఉంచుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక, ప్లాస్టిక్ గుడ్ల వ్యవహారం తరుచుగా బయటపడుతోంది. ఇటీవలే పశ్చిమ బెంగాల్ తో పాటు పలు ప్రాంతాల్లో ప్లాస్టిక్ గుడ్లు దర్శనమిచ్చాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లోని హల్ద్‌వానీలో ప్లాస్టిక్ గుడ్లు అలజడి రేపాయి.
గుడ్డులో ఎన్నో పోషక విలువలు ఉంటాయని, దాన్ని ఉడికించి తింటే కడుపు నిండడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలని భావించిన ఓ వ్యక్తి వాటిని తెచ్చుకున్నాడు. అయితే, ఆ గుడ్లను ఉడికిద్దామని వేడినీళ్లలో వేయగానే అవి ప్లాస్టిక్ లా మారిపోయాయి. దీంతో అవి ప్లాస్టిక్ గుడ్లని గుర్తించిన ఆ వ్యక్తి స్థానిక అధికారులకు ఈ విషయాన్ని తెలిపాడు. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిల్లో ఏవైనా రసాయనాలు ఉన్నాయా? అనే అంశంపై ఆరా తీస్తున్నారు.