: ‘తీవ్రంగా రెచ్చగొట్టింది’ అంటూ అమెరికా ప్రయోగంపై ఉత్తర కొరియా ఆగ్రహం!
అంతర్జాతీయంగా హెచ్చరికలు వస్తున్నప్పటికీ వరుసగా అణ్వాయుధ ప్రయోగాలను చేస్తూ ఉత్తర కొరియా దుస్సాహసానికి పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులు ప్రయోగించే అణ్వాయుధాలను మధ్యలోనే తుత్తినియలు చేసే వ్యవస్థను అమెరికా నాలుగు రోజుల క్రితమే విజయవంతంగా పరీక్షించింది. దీనిపై ఉత్తరకొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించడం సైనికంగా తమను తీవ్రంగా రెచ్చగొట్టడమేనని ఉత్తర కొరియా సైనికాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అణుయుద్ధం చేయాలన్న అమెరికా కోరికను ఈ ప్రయోగంతో అర్థం చేసుకోవచ్చని తెలిపారు.
తమ దేశానికి వ్యతిరేకంగా అణుయుద్ధాన్ని ప్రారంభించడానికి అమెరికా చేస్తోన్న ప్రయత్నాలు తుదిదశకు చేరాయన్న సంకేతాన్ని ఈ దుశ్చర్య తెలుపుతోందని ఆయన వ్యాఖ్యానించారు. తమ దేశం ఆత్మరక్షణకు అణ్వాయుధ పరీక్షలు జరపడం సరైనదేనని అమెరికా చర్యల వల్ల అర్థమవుతుందని తెలిపారు. అమెరికా పరీక్షించిన ఇటువంటి ఇంటర్‌సెప్షన్ వ్యవస్థలు తమ అణ్వాయుధాలను అడ్డుకోలేవని ఆయన ధీమాగా అన్నారు.