: నన్నే బెదిరించారు.. కేసులు పెట్టేందుకు కుట్ర పన్నారు: 'విశాఖ భూ కుంభకోణం'పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు


విశాఖ భూ కుంభకోణంపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. భూ కబ్జాలపై ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్పందించడం హర్షణీయమని... నేతలంతా అయ్యన్నపాత్రుడిలా ఉంటే రాష్ట్రం ఎప్పుడో బాగుపడేదని చెప్పారు. ముదపాక భూముల వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు, కొందరు తననే బెదిరించారని తెలిపారు. తనపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టేందుకు కూడా కుట్ర పన్నారని చెప్పారు. అయితే, తాను ఎలాంటి బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదని అన్నారు.

మరోవైపు, విజయవాడ ఎంపీ కేశినేని నానికి విష్ణుకుమార్ రాజు సవాల్ విసిరారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నందు వల్లే మెజార్టీ తగ్గిందని కేశినేని నాని చేసిన వ్యాఖ్యల పట్ల మండిపడ్డారు. రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల బరిలోకి దిగాలని ఆయనకు సూచించారు. ప్రజల్లోకి వెళ్తే ఎవరిది బలుపో? ఎవరిది వాపో? తేలిపోతుందని ఎద్దేవా చేశారు. నాని స్థానంలో తానుంటే రాజీనామా చేసేవాడినని చెప్పారు. గత ఎన్నికల్లో బీజేపీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతిచ్చారని... ఆయనను గుర్తుంచుకుంటామని చెప్పారు. ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసే రకం తాము కాదని అన్నారు. 

  • Loading...

More Telugu News