: మంత్రి గారి రివాల్వర్ తో ఎమ్మారై స్కానర్ కు జబ్బు!
ఓ మంత్రిగారు చేసిన ఘన కార్యానికి ఆసుపత్రిలో ఖరీదైన యంత్రం పనిచేయడం మానేసింది. ఆ వివరాలలోకి వెళితే, ఆరోగ్య పరీక్షకు యూపీకి చెందిన మంత్రి సత్యదేవ్ చౌదరి లక్నోలోని లోహియా ఆసుపత్రికి వెళ్లారు. ఆయనకు ఎంఆర్ఐ స్కాన్ చేయవలసి వచ్చింది. అయితే, ఆ సమయంలో శరీరంపై లోహపు వస్తువులేమీ ఉంచనీయరు. ఆఖరుకి బంగారు వస్తువులు కూడా వుండకూడదు. కారణం, మెషీన్ కున్న అయస్కాంత క్షేత్రం కారణంగా ప్రమాదం జరిగే అవకాశం వుంది. అయితే సదరు మంత్రి గారు మాత్రం ఒంటి మీద వస్తువులన్నీ తీసేసినా, రివాల్వర్ మాత్రం ఎవరికీ కనిపించకుండా తన దగ్గరే ఉంచుకున్నారు. ఎంఆర్ఐ స్కాన్ సిబ్బంది దానిని గమనించక, స్కానింగ్ కు అంతా సిద్ధం చేశారు. మెషీన్ ఆన్ చేసేందుకు ఆయనను లోపలికి వెళ్లమన్నారు. ఇంతలో ఆ మెషీన్ కు అతను దాచి ఉంచిన రివాల్వర్ అతుక్కుపోయి మిషన్ పని చేయడం మానేసింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది లబోదిబోమన్నారు.