: పాక్ ను ఇండియా ఎందుకు ఓడిస్తుందో వివరించిన అఫ్రిదీ!
ఛాంపియన్స్ ట్రోఫీలో దాయాది దేశాల మధ్య జరిగే పోరులో టీమిండియానే గెలుస్తుందని పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ తేల్చి చెప్పాడు. ఇటీవలి కాలంలో టీమిండియా సాధించిన విజయాలు, జట్టులో ఉన్న ఆటగాళ్ల సత్తా భారత్ ను ఫేవరెట్ గా నిలుపుతున్నాయని చెప్పాడు. ఐసీసీ అఫీషియల్ వెబ్ సైట్ కు రాసిన కాలమ్ లో అఫ్రిదీ ఈ విషయాన్ని తెలిపాడు. కెప్టెన్ కోహ్లీ, పేసర్ జస్ప్రీత్ బుమ్రాలు టీమిండియాకు అదనపు బలమని చెప్పాడు. 2012లో జరిగిన ఆసియా కప్ లో పాక్ పై కోహ్లీ చేసిన సెంచరీని మరిచిపోలేమని... అదే విధంగా 2015 ప్రపంచకప్ లో అడిలైడ్ లో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ సాధించిన సెంచరీ ఇండియాను ఎలా గెలుపుతీరాలకు చేర్చిందో అఫ్రిదీ చెప్పాడు.
పాక్ బౌలర్లకు కోహ్లీ కొరకరాని కొయ్య అని పేర్కొన్నాడు. కోహ్లీ క్రీజ్ లోకి వచ్చిన వెంటనే అతనిపై దాడి మొదలు పెట్టాలని, తొందరగా అతన్ని ఔట్ చేయగలిగితే, ఇండియాను తక్కువ స్కోరుకే కట్టడి చేసే అవకాశం ఉండవచ్చని చెప్పాడు. ఒకవేళ కోహ్లీ క్రీజులో కుదురుకుంటే పాకిస్థాన్ కు కష్టాలు తప్పవని తెలిపాడు. పేసర్ జస్ ప్రీత్ బుమ్రా స్కిల్ చాలా అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. పాకిస్థానీ యార్కర్లను అతను సంధించగలడని చెప్పాడు. 90వ దశకంలో పాకిస్థానీ పేసర్లు వేసినటువంటి యార్కర్లను బుమ్రా వేయగలడని చెప్పాడు.