: బీహార్ టాపర్ వయసులో మహా 'ముదురు'!
బీహార్ టాపర్ల కుంభకోణంలో కొత్తకొత్త విషయాలు బయటకొస్తున్నాయి. నకిలీ ధ్రువపత్రాలతో పరీక్షలు రాసిన 12వ తరగతి హ్యుమానిటీస్ విభాగం రాష్ట్ర టాపర్ గణేశ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. గణేశ్ ది అసలు బీహార్ కాదు. జార్ఖండ్ రాష్ట్రం, ఉపాధి నిమిత్తం బీహార్ వలస వచ్చాడు. అతనికి పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అతని వయసు 42 ఏళ్లైతే.. తన వయసు 24 ఏళ్లని చెప్పి, నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి పరీక్షకు హాజరయ్యాడు.
టాపర్ గా నిలవడంతో ఆయనను ప్రశ్నించేందుకు మీడియా క్యూ కట్టింది. ఈ క్రమంలో మ్యూజిక్ లో 70 మార్కులకు 65 మార్కులు సాధించడం గొప్ప విషయమని అభినందిస్తూ....సంగీతంపై కొన్ని ప్రశ్నలు వేసిన మీడియా షాక్ కు గురైంది. అతనికి లతా మంగేష్కర్ అంటే ఎవరో తెలియకపోవడం మీడియాను ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో పాటలు పాడమంటే దారుణంగా పాడాడు. దీనిని చూసిన మీడియా దీనిపై విద్యాశాఖాధికారులను ఆరాతీయడంతో కుంభకోణం వెలుగులోకి వచ్చింది.