: దారుణం... సంతానం కోసం ఏడు నెలల పసికందు కిడ్నాప్, బలి!
పిల్లలు పుట్టడం లేదని ఏడు నెలల పసికందును కిడ్నాప్ చేసి బలిచ్చిన ఘటన జంషెడ్ పూర్ లో కలకలం రేపుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే... జార్ఖండ్ లోని సెరైకేలా–ఖర్స్వాన్ జిల్లాలోని తిరుల్దీ గ్రామానికి చెందిన బదోయ్ కాళింది అనే వ్యక్తి పాములు ఆడిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి వివాహమై సంతానం కలగకపోవడంతో ఎలాగైనా పిల్లల్ని కనాలని... ఆ ప్రాంతంలో మంత్రగాడిగా పేరొందిన కర్మూను ఆశ్రయించాడు. దీంతో పిల్లలు కలగాలంటే నరబలివ్వాలని కర్మూ అతనికి చెప్పాడు. దీంతో నరబలి ఎలా అంటే దానికి కూడా కర్మూ ప్లాన్ చెప్పాడు.
దీంతో మే 26న అర్ధరాత్రి... అంతా నిద్రపోయిన తరువాత బదోయ్ తో కలిసి కర్మూ తన నివాసం సమీపంలో ఉంటున్న సుభాష్ గోపే ఏడు నెలల కుమార్తెను ఎత్తుకొచ్చాడు. అనంతరం గ్రామ సమీపంలోని నదీ తీరంలో పాపను బలిచ్చారు. పాప కనిపించకపోవడంతో సుభాష్ గోపే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి వారు దర్యాప్తు ప్రారంభించారు. నరబలి అనంతరం కర్మూ కనిపించకుండా పోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు అతనిని పట్టుకుని విచారించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితులను అరెస్టు చేశారు. వారు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలిక మృతదేహం కోసం గాలిస్తున్నారు.