: గెడ్డం గీసుకోవడానికి నిరాకరించిన భర్త.. మరుగుతున్న నీళ్లు పోసిన భార్య!


గెడ్డం గీసుకోవడానికి నిరాకరించిన భర్తపై మరుగుతున్న నీళ్లు పోసిందో భార్య. ఉత్తరప్రదేశ్‌లో జరిగిందీ ఘటన. అలీగఢ్‌కు చెందిన సల్మాన్ ఖాన్ (32), నగ్మా భార్యభర్తలు. మత విశ్వాసం కారణంగా సల్మాన్ గెడ్డం  పెంచుతూ వస్తున్నాడు. భర్త గెడ్డం పెంచడం ఇష్టం లేని భార్య దానిని తీసివేయమంటూ పలుమార్లు కోరింది. అందుకు సల్మాన్ నిరాకరిస్తూ వస్తున్నాడు. శుక్రవారం ఇదే విషయమై మరోమారు భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహం పట్టలేని నగ్మా భర్తపై మరుగుతున్న నీళ్లు పోసింది. ప్రస్తుతం సల్మాన్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

వీరికి ఆరు నెలల క్రితమే వివాహమైందని, అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు పోలీసులు తెలిపారు. భర్త ఆహార్యం విషయంలో నగ్మా తరచూ చేస్తున్న సూచనలు సల్మాన్ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. కుర్తా-పైజమా స్థానంలో ప్యాంట్, షర్ట్ ధరించాలని నగ్మా రోజూ వేడుకుంటున్నా సల్మాన్ అందుకు నిరాకరించేవాడని పోలీసులు వివరించారు. అలాగే గెడ్డం విషయంలోనూ రోజూ ఇద్దరి మధ్య గొడవ జరిగేదని పేర్కొన్నారు. కాగా, భార్య నగ్మాపై సల్మాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నగ్మాపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News