: పొగతాగే హెచ్ఐవీ పేషెంట్లలో మరణం రిస్క్ రెండురెట్లు ఎక్కువట!
పొగతాగడం, పొగాకు నమలడం, పీల్చడం వల్ల హెచ్ఐవీ పేషెంట్లలో మరణం రిస్క్ రెండు రెట్లు అధికమని తాజా అధ్యయనంలో తేలింది. హెచ్ఐవీ రోగులకు పొగాకు సైలెంట్ కిల్లర్ అని బ్రిటన్‌లోని యార్క్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణంగా హెచ్ఐవీ సోకిన వారు తమ జీవిత కాలాన్ని ఐదు సంవత్సరాలు మాత్రమే కోల్పోతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే పొగాకు తాగే, నమిలే అలవాటు ఉన్న హెచ్ఐవీ రోగులు తమ జీవితంలో 12 ఏళ్లు కోల్పోయే అవకాశం ఉందని అధ్యయనకారులు తెలిపారు.
అంటే పొగాకు వాడకం వల్ల మరణించే రిస్క్ రెండు రెట్లు అధికంగా ఉన్నట్టు వివరించారు. అయితే హెచ్ఐవీ రోగుల్లో పొగాకు వాడకం ఎందుకు అధికంగా ఉంటుందన్న విషయం ఇప్పటి వరకు తమకు అంతుబట్టలేదని తెలిపారు. ఈ విషయమై మరింత అధ్యయనం అవసరమని పేర్కొన్నారు. యార్క్ యూనివర్సిటీ తాజా అధ్యయనం హెల్త్ జర్నల్‌లో ఇది ప్రచురితమైంది.