: లతామంగేష్కర్ ఎవరో తెలియని బీహార్ బోర్డ్ మ్యూజిక్ టాపర్ అరెస్ట్.. ఫలితాలు రద్దు!


బీహార్ బోర్డ్ టాపర్ గణేశ్ కుమార్‌ అరెస్టయ్యాడు. డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసిన నేరంపై అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి పరీక్ష ఫలితాలను బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు (బీఎస్ఈబీ) రద్దు చేసింది. ఓ జాతీయ న్యూస్ చానల్ ఇంటర్వ్యూలో అతి సాధారణ ప్రశ్నలకు కూడా గణేశ్ కుమార్ సమాధానం చెప్పలేక నీళ్లు నమలడంతో బీఎస్ఈబీపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అతడి రిజల్ట్‌ను రద్దుచేయడమే కాకుండా పోలీసు కేసు కూడా నమోదు  చేసింది. అతడి రిజల్ట్ రద్దు తక్షణమే అమల్లోకి వస్తుందని బీఎస్ఈబీ చైర్మన్ ఆనంద్ కిషోర్ తెలిపారు.

బీఎస్ఈబీ నిర్ణయంతో అందరూ అవాక్కయ్యారు. మొన్నటి వరకు గణేశ్ కుమార్‌ను వెనకేసుకొచ్చిన బోర్డు అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఆశ్చర్యపోతున్నారు. గణేశ్ కుమార్‌ మెరిట్‌ గురించి ప్రశ్నించే హక్కులేదని ఆనంద్ కిషోర్ రెండు రోజుల క్రితం వ్యాఖ్యానిస్తూ అతడికి అండగా నిలిచారు. బిహార్ విద్యా శాఖామంత్రి అశోక్ చౌదరి కూడా ఆనంద్‌కు వంతపాడారు. అతడు జెన్యూన్ స్టూడెంట్ అని కితాబిచ్చారు.

కాగా, మ్యూజిక్ ప్రాక్టికల్స్‌లో 70 మార్కులకు గాను 65 మార్కులు సాధించిన గణేశ్ కుమార్ చిన్నచిన్న ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పలేకపోవడం వివాదాస్పదమైంది. లతామంగేష్కర్ కూడా ఎవరో తెలియకపోవడం, బాలీవుడ్ పాటలను శ్రుతి, లయ లేకుండా పాడడంతో అతడి రిజల్ట్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. బీఎస్ఈబీ తీరుపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు స్పందించిన బోర్డు అతడి రిజల్ట్‌ను రద్దు చేసి, అరెస్ట్ చేయించింది.

  • Loading...

More Telugu News