: కశ్మీర్‌లో భద్రతా దళాలకు సవాలు విసురుతున్న ‘బెడ్రూం జిహాదీ’లు!


కశ్మీర్‌లో భద్రతా దళాలకు ఇప్పుడు సరికొత్త ఉగ్రవాదం సవాలు విసురుతోంది.  ఉగ్రవాదులను అణచివేసేందుకు సైన్యం కఠిన చర్యలు చేపట్టిన ప్రతిసారి ఉగ్రవాదం కొత్త రూపం సంతరించుకుంటోంది. తాజాగా జమ్ముకశ్మీర్‌లో ‘బెడ్రూం జిహాదీ’లు భద్రతా దళాలకు సవాలు విసురుతున్నారు. ఇప్పటి వరకు బులెట్లు, ఇటుకబెడ్డలతో సెక్యూరిటీ సిబ్బందిపై విరుచుకుపడిన ఉగ్రవాదులు ఇప్పుడు పంథా మార్చుకున్నారు. ‘బెడ్రూం జిహాదీ’లుగా మారి యువతను రెచ్చగొడుతున్నారు.

బెడ్రూంలోనో, కేఫ్‌లోనో, రోడ్డుమీద కల్వర్ట్ పైనో కూర్చుని ఎవరికీ అనుమానం రాకుండా సోషల్ మీడియాను మేనిప్యులేట్ చేస్తున్నారు. యువతను రెచ్చగొడుతూ రోడ్లపైకి పంపుతున్నారు. సోషల్  మీడియా ద్వారా మత కల్లోలాలు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ఇది తమకు కొత్త యుద్ధభూమిగా మారిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆయుధాలను పట్టుకుని వీధులు, అడవుల్లో ఉండి పోరాడడాన్ని ఉగ్రవాదులు మానేశారని అన్నారు. కొత్త తరం జిహాదీలు కశ్మీర్ లోపలో, వెలుపలో, కేఫుల్లోనే, ఇళ్లలోనో, వీధుల్లోనే, తమకు అనుకూలంగా ఉండే మరో ప్రదేశంలోనో కూర్చుని స్మార్ట్‌ఫోన్ల ద్వారా సోషల్  మీడియాను ప్రభావితం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

జూన్ 29న ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్ర ఇప్పుడు తమకు సవాలుగా మారిందని ఆయన పేర్కొన్నారు. 40 రోజులపాటు జరిగే ఈ యాత్రను బెడ్రూం జిహాదీలు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉగ్రవాదుల సోషల్ మీడియా గ్రూపులు ఒక్క జమ్ముకశ్మీర్‌లోనే లేవని, ఢిల్లీ, దేశంలోని ఇతర ప్రదేశాలతోపాటు విదేశాల్లోనూ ఉన్నాయన్నారు. సామాజిక మాధ్యమాల్లో లక్షలాది మంది ఉండడం వల్ల ఒక్క వ్యక్తి ఎక్కడున్నాడో గుర్తించడం కష్టమైన పని అని పోలీసులు చెబుతున్నారు. లోయలోని సోషల్ మీడియా గ్రూపులపై ఓ కన్నేసి ఉంచాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది.

  • Loading...

More Telugu News