: ఎంతో మంది బ్రాహ్మణులు ఈ పాట 'అద్భుతం' అంటూ కామెంట్ చేశారు.. అవి సేవ్ చేసుకొని పెట్టుకున్నాను!: ‘డీజే’ వివాదంపై హరీశ్ శంకర్
అల్లు అర్జున్ నటిస్తోన్న ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలోని ‘గుడిలో బడిలో మడిలో వడిలో’ అనే పాటపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విషయంపై ఆ సినిమా దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏదైనా ఓ సాహిత్యంపై కొందరు విమర్శలు చేస్తారని, మరికొందరు ప్రశంసలు చేస్తారని అన్నారు. తెలుగు సినిమా సాహిత్యం చచ్చిపోతోందని కొందరు అంటున్నారని, తాము మంచి సాహిత్యాన్ని ఈ పాటలో ఉంచాలని చూశామని అన్నారు. ఈ పాటను అర్థం చేసుకోకపోయినా ఫర్వాలేదని, అపార్థం మాత్రం చేసుకోకండని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఒక జోకు రాసినా, డైలాగ్ రాసినా, పాట రాసినా పది మందీ మెచ్చుకోవాలనే చూస్తామని హరీశ్ శంకర్ అన్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు తాను, గీత రచయిత సాహితి కలిసి న్యూస్ ఛానెల్‌లోకి వచ్చి పలు విషయాలు వివరిస్తామని అన్నారు. యూట్యూబ్‌లో ఈ పాటని ఎంతో మంది బ్రాహ్మణులు అద్భుతం అని మెచ్చుకున్నారని, అవి సేవ్ చేసుకొని పెట్టుకున్నానని, తాను వాటిని చూపిస్తానని తెలిపారు. ఎవరికీ నచ్చకుండా ఈ పాట ఇంత పెద్ద హిట్ కాదని అన్నారు. యూట్యూబ్‌లో లక్షల మంది ఈ పాటను చూశారని తెలిపారు. ఆ పాటలోని కొన్ని పదాలను పట్టుకుని బ్రాహ్మణ కులంలో పుట్టిన తననే కొందరు విమర్శిస్తున్నారని ఆయన వాపోయారు. ఈ పాటను హిట్ చేసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని పేర్కొన్నారు. తాను ఇప్పుడు షూటింగ్‌లో బిజీగా ఉన్నానని, ఈ సినిమా జూన్ 23న విడుదలవుతుందని, ఆ తరువాత వచ్చి మాట్లాడుతానని చెప్పారు.