: చదువు తలకెక్కలేదని అన్నంత మాత్రాన సరస్వతి దేవిని అవమానించడమా? ఇదీ అంతే!: హరీశ్ శంకర్
పిల్లవాడు సరిగ్గా చదువుకోకపోతే ‘వాడికి చదువు తలకెక్కలేద’ని అంటారని, అంత మాత్రాన సరస్వతి దేవిని అవమానించడం అవుతుందా? అని ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా దర్శకుడు హరీశ్ శంకర్ వ్యాఖ్యానించారు. తాను చిత్రీకరిస్తోన్న అల్లు అర్జున్ ‘డీజే’ సినిమాలోని ‘గుడిలో బడిలో మడిలో వడిలో’ అనే పాటలో వాడిన కొన్ని పదాలను పట్టుకొని విమర్శలు చేయడం కూడా అంతేనని అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... అగ్రహారం, తమలపాకు అనే పదాలు ఈ సినిమాలోని హీరోకు ఎక్కువగా వినిపించే పదాలని, తనకు బాగా పరిచయం వున్న పదాలను ఉపయోగిస్తూ హీరో పాటపాడతాడని ఆయన అన్నారు.
ఆ పాటలోని ఆ పదాల వినియోగాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా పలువురు అభ్యంతరం తెలుపుతున్నారని, అంతే తప్పా ఇందులో ఏమీ లేదని హరీశ్ శంకర్ అన్నారు. తనకు ఏ సామాజిక వర్గం మీదా కోపం లేదని అన్నారు. దిల్ రాజుకి కూడా హిందు మతం మీద ఎంతో గౌరవం ఉందని అన్నారు. తాను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన పదహారణాల అబ్బాయినని, తాను చికెన్ కాదు కదా, కనీసం గుడ్డును కూడా ముట్టుకోనని తెలిపారు. ఒక సామాజిక వర్గాన్ని కించపరుద్దామని ఎవ్వరూ సినిమాలు తీయబోరని అన్నారు. తానయితే అస్సలు తీయబోనని తెలిపారు.