: ఆ కుంభకోణంతో నాకు సంబంధం లేదు... దిగ్విజయ్ సింగ్ పై రూ. 10 కోట్లకు పరువునష్టం దావా వేస్తున్నా: తలసాని
మియాపూర్ భూ కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని... అయినప్పటికీ, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. తన పరువుకు భంగం కలిగించే విధంగా దిగ్విజయ్ వ్యవహరించారని... ఆయనపై సికింద్రాబాదులోని మహంకాళి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్నానని చెప్పారు. దీనికి తోడు, ఆయనపై రూ. 10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని వదిలిపెట్టబోనని చెప్పారు.
తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందంటూ విమర్శించే అర్హత రాహుల్ గాంధీకి లేదని... కాంగ్రెస్ పార్టీలోనే కుటుంబ పాలన ఉందని తలసాని అన్నారు. ఒక్క మీటింగ్ కే ఏదో సాధించేశామని కాంగ్రెస్ నేతలు సంబరపడిపోతున్నారని ఎద్దేవా చేశారు.