: నేను కూడా బ్రాహ్మణుడినే.. నా సమాజాన్ని ఎందుకు కించపరుస్తాను?: ‘డీజే’ వివాదంపై దర్శకుడు హరీశ్ శంకర్
అల్లు అర్జున్ హీరోగా యంగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ చిత్రీకరిస్తోన్న ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలోని ‘గుడిలో బడిలో మడిలో వడిలో’ అనే పాటపై బ్రాహ్మణ సంఘాలు తీవ్ర అభ్యంతరం చెబుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఈ రోజు హరీశ్ శంకర్ మీడియాతో ఫోన్లైన్లో మాట్లాడాడు. ఈ సినిమాలో హీరోనే బ్రాహ్మణుడిలా చూపిస్తున్నామని, తాను కూడా బ్రాహ్మణ కులానికి చెందిన వాడినేనని చెప్పాడు. బ్రాహ్మణ సమాజంలో పుట్టి ఆ సమాజాన్నే కించపరచేలా తాను ప్రవర్తించబోనని అన్నాడు. వితండవాదులు చేసిన ఆరోపణల పట్ల తమ సినిమా యూనిట్ త్వరలోనే మీడియా ముందుకు వచ్చి సమాధానం చెబుతుందని చెప్పాడు. ఓ బ్రాహ్మణుడిగా పుట్టడం తాను పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యంగా భావిస్తానని అన్నాడు. ఈ సినిమాలోని ఆ పాటలో తప్పు ఏమీలేదని అన్నాడు. మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరణ ఇస్తానని చెప్పాడు.
అయితే బ్రాహ్మణ సంఘాల నేతలు మాత్రం ఆయన మాటలపై మండిపడ్డారు. దైవత్వం, దేవుడికి సంబంధించిన పదాలని ఉపయోగిస్తూ ఇటువంటి పాట రాసిందిగాక నీతులు చెబుతున్నాడని అన్నారు. డీజే పాటలో శివుడిని కించపర్చేలా పలు పదాలు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా తీస్తున్నవారి స్వార్థం కోసం ఇటువంటి చర్యలకు పాల్పడడం మంచిది కాదని అన్నారు. తాము సినిమాలోని పాట గురించి, మాట్లాడితే హరీశ్ శంకర్ మరో విషయం గురించి మాట్లాడారని, తానూ బ్రాహ్మణుడినేనని, హీరోనే బ్రాహ్మణుడిగా చూపిస్తున్నామని ఆయన అనడం ఏంటని వారు ప్రశ్నించారు. ఈ పాటలోని నమకం, చమకం, అగ్రహారం, ప్రవర, తమలపాకు వంటి పదాలపై మాత్రమే తాము అభ్యంతరం చెబుతున్నామని, సినిమాలో హీరో అవతారం గురించి మాట్లాడడం లేదని అన్నారు.