: రోగిని తీసుకెళ్లడానికి స్ట్రెచర్ ఇవ్వని సిబ్బంది.. భర్తను ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన భార్య
ప్రభుత్వాసుపత్రుల్లో పేషెంట్లు పడుతున్న బాధలు వర్ణనాతీతం. మృతదేహాన్ని తీసుకెళదామంటే ఆసుపత్రుల సిబ్బంది అంబులెన్సులు అందించని ఘటనలు, రోగిని ఆసుపత్రిలోకి తీసుకెళదామంటే స్ట్రెచర్లు, వీల్ఛైర్లు అందించకుండా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఘటనలు ప్రతిరోజు వార్తల్లో వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వాసుపత్రుల తీరు మారడం లేదు. ఇటువంటి ఘటనే కర్ణాటకలోని షిమోగాలో మరొకటి చోటు చేసుకుంది. ఫమిదా అనే మహిళ తీవ్ర అస్వస్థతకు గురైన తన భర్త అమిర్ సాబ్‌ను మేగన్ ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా, అక్కడి సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
ఆసుపత్రిలో స్ట్రెచర్ కూడా లేకపోవడంతో తన భర్తను ఆసుపత్రిలో పై అంతస్తులో ఉన్న ఎక్స్‌రే రూమ్ వరకు ఆమె కింది అంతస్తు నుంచి ఈడ్చుకెళ్లింది. కన్నీరు పెట్టుకుంటూనే వ్యాధితో బాధపడుతున్న తన భర్తను ఇలా ఈడ్చుకుంటూ ఎక్స్ రే రూమ్ వరకు తీసుకెళ్లి ఎక్స్ రే తీయించింది. తన భర్తను తీసుకెళ్లడానికి స్ట్రెచర్ ఇవ్వమని చెబితే ఆసుపత్రి సిబ్బంది తనతో అది లేదని చెప్పారని ఆ మహిళ కన్నీరు పెట్టుకుంది.