: ప్రేమించమంటూ వేధించాడు.. ఆమె తిరస్కరించడంతో ఆ యువతి ఫొటోలు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు!
తనను ప్రేమించాలని ఓ యువతిని వేధించిన ఓ యువకుడు ఆమె ఒప్పుకోకపోవడంతో ఫేస్‌బుక్‌లో ఆమెకు సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేసిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. నేరేడ్ మెట్‌కు చెందిన ప్రవీణ్ అనే ఓ యువకుడు ఎల్బీనగర్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న ఓ యువతితో చనువుగా మాట్లాడి స్నేహం పెంచుకుని, ఆమెతో సెల్ఫీలు దిగాడు. అంతేగాక, ఆమెకు తెలియకుండా ఆమె ఫొటోలను తీశాడు. చివరికి ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పాడు. దానికి ఆ యువతి ఒప్పుకోలేదు. ఇకపై తనతో మాట్లాడవద్దని, ఇన్నాళ్లు కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే చేశానని చెప్పింది. అయినా సదరు యువకుడు వినిపించుకోకుండా ప్రేమిస్తున్నానంటూ ఆమెను ప్రతిరోజు వేధిస్తున్నాడు.
అతని వేధింపులు పడలేక ఆ యువతి షాపింగ్‌మాల్‌లో ఉద్యోగం మానేసింది. అయినప్పటికీ ఆ యువకుడు ఆమెను సోషల్ మీడియా ద్వారా వేధించడం మొదలుపెట్టాడు. ఆమెతో స్నేహం చేసినప్పుడు తీసుకున్న ఫొటోలను ఆమె పేరిట ఓ నకిలీ ఫేస్‌బుక్ ఖాతా తెరచి అందులో పోస్ట్ చేస్తున్నాడు. ఈ విషయం ఆ యువతికి తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రవీణ్‌ను అరెస్టు చేసి, అతడి నుంచి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.