: పాక్ పై ఒక్క అణుబాంబు వేసిరండి: వీహెచ్పీ నేత ఆచార్య ధర్మేంద్ర
కాల్పుల విరమణ ఒప్పందానికి నిత్యమూ తూట్లు పొడుస్తూ, భారత పోస్టులపై దాడులు చేస్తున్న పాకిస్థాన్ పై ఓ అణుబాంబు వేసి రావాలని విశ్వహిందూ పరిషత్ నేత ఆచార్య ధర్మేంద్ర సలహా ఇచ్చారు. భారత ఉపఖండంలో శాంతి నెలకొనాలంటే, పాక్ పై అణుబాంబు వేసి, వారిని కోలుకోలేని దెబ్బతీయడం ఒక్కటే మార్గమని ఆయన అన్నారు. రాజస్థాన్ లోని కోటలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పాకిస్థాన్ పొరుగు దేశం కాదని, అది ఇండియాకు శత్రు దేశమని కూడా ధర్మేంద్ర అభివర్ణించారు.
ఇండియా, పాకిస్థాన్ ల మధ్య ఈ వివాదానికి జాతిపితగా భారతీయులు కొలుచుకునే మహాత్మా గాంధీ కారణమని ఆరోపించారు. అసలు దేశ కరెన్సీ మీద ఆయన చిత్రాలను ఎందుకని ప్రశ్నించిన ధర్మేంద్ర, గోవును జాతీయ మాతగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వం టాయిలెట్లు కట్టించడంపై మాత్రమే దృష్టిని సారించిందని ఆచార్య ధర్మేంద్ర విమర్శించారు.