: ట్రంప్ పొరపాటు చేశారు: ఫ్రాన్స్, కెనడా అధినేతలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పొరపాటు చేశారని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మేక్రాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడ్ అభిప్రాయపడ్డారు. పారిస్ ఒప్పందం నుంచి ట్రంప్ వైదొలుగుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై మేక్రాన్ మాట్లాడుతూ, అమెరికా ప్రజల పట్ల ఆయన సరైన నిర్ణయం తీసుకోలేకపోయారని, ఇది భావితరంపై ప్రభావం చూపుతుందని అన్నారు. అమెరికా అధ్యక్షుడి నిర్ణయంతో అసంతృప్తి చెందిన వారిని ఫ్రాన్స్ తమ దేశానికి స్వాగతిస్తోందని, వారందరికీ ఫ్రాన్స్ మరో స్వదేశం అవుతుందని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం శ్రమించే ఫ్రాన్స్ ఈ ఒప్పందం నుంచి ఎన్నటికీ వైదొలగదని స్పష్టం చేశారు.
దీనిపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడ్ మాట్లాడుతూ, అమెరికా ఒప్పందం నుంచి వైదొలగడం అసంతృప్తిని కలిగించిందని అన్నారు. తాము అమెరికాలాగ యూటర్న్ తీసుకోవడం లేదని, ఈ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. కాగా, ఈ ఒప్పందం అమలుకు ప్రపంచంలోని 190 దేశాలు అంగీకరించాయి. అమెరికా కూడా అంగీకరించింది. అయితే ట్రంప్ దానిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ట్రంప్ నిర్ణయం నేపథ్యంలో ఈ ఒప్పందంలో భాగస్వాములైన ఇతర దేశాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.