: ప్రజలను కష్టపెడుతున్నాను... మరచిపోలేని, మరువకూడని రోజు కాబట్టే: చంద్రబాబు
మండుతున్న ఎండల్లో సైతం నవ నిర్మాణ దీక్ష పేరిట తాను ప్రజలను కష్టపెట్టాల్సి వస్తోందని, రాష్ట్రానికి ఎంతో అన్యాయం జరిగిన జూన్ 2వ తేదీని ఎవరూ మరచిపోకూడదు కాబట్టే తానిలా చేయాల్సి వస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం విజయవాడ బెంజ్ సర్కిల్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. ఆనాడు జరిగిన విషయాలను మరొక్కసారి గుర్తు చేసుకుని రాష్ట్ర నిర్మాణం కోసం పునరంకితం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
ప్రజల కష్టాన్ని తాను అర్థం చేసుకోగలుగుతానని అన్నారు. మండే ఎండల కారణంగా శారీరకంగా కొంత శ్రమ ఉంటుందని చెప్పారు. అన్ని రాష్ట్రాలూ అవతరణ దినోత్సవాలను జరుపుకుంటాయని, అదే సమయంలో మనం మాత్రం నవ నిర్మాణ దీక్ష చేసి, రాష్ట్ర అవతరణ సందర్భంగా జరిగిన అన్యాయాన్ని నెమరువేసుకుని, రాష్ట్రాభివృద్ధికి పునరంకితమయ్యే రోజు ఇదని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఇదో చీకటి రోజని తెలిపారు. అన్యాయం జరిగిందని ఇళ్లలో పడుకుని సాధించేది ఏమీ లేదని, బయటకు వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత జపాన్ వాసులు చూపిన స్ఫూర్తి, ఆ దేశాన్ని అగ్రదేశాల్లో ఒకటిగా నిలిపిందని, అలాగే నవ్యాంధ్ర ప్రజలూ ముందడుగు వేయాలని కోరారు.