: ఐదు రోజుల ముందు టికెట్ కొనెయ్...14 రోజులలోపు డబ్బులివ్వు: ఇండియన్ రైల్వే కొత్త ప్రయోగం
రైలు ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) సరికొత్త ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ ప్రకారం ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లో రిజిస్టర్ అయిన ప్రయాణికుడు తన ప్రయాణానికి ఐదు రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుని, టికెట్ తీసుకున్న 14 రోజులలోపు డబ్బులు చెల్లించే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పద్ధతిని అన్ని రైళ్లకూ వర్తింపచేయనున్నట్టు ఐఆర్సీటీసీ అధికార ప్రతినిధి సందీప్ దత్తా తెలిపారు. అయితే ఇలా ముందుగా టికెట్ తీసుకుని తరువాత చెల్లించే ప్రయాణికుల నుంచి 3.5 శాతం సర్వీసు చార్జ్ వసూలు చేయనున్నామని ఆయన తెలిపారు. ఈ విధానం ప్రయాణికులకు ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.