: పరాజయం తరువాత తొలిసారి ట్రంప్ పై తీవ్ర ఆరోపణలు చేసిన హిల్లరీ క్లింటన్


అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఓటమి తర్వాత పెద్దగా బయటకు రాని హిల్లరీ క్లింటన్‌ తొలిసారి తన పరాజయ కారణాలపై సవివరంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ట్రంప్ వర్గం సహకారంతో తనపై రష్యా చేసిన వ్యతిరేక ప్రచారం కారణంగానే తాను ఓటమిపాలయ్యానని అన్నారు. పోలింగ్ ఇతర వివరాలను ట్రంప్ అనుచరులు రష్యాకు చేరవేయడంవల్లే తాను పరాజితనయ్యానని చెప్పారు. ఎన్నికల ముందు, అనంతరం ట్రంప్‌ ప్రచార బృందం, సహచరులకు రష్యాతో ఉన్న సంబంధాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పిన ఆమె, అన్నీ బహిర్గతమైతే ట్రంప్ విజయానికి సహకరించిన వారి వివరాలు బయటకొస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే మీడియా కూడా తనపై కొంత తప్పుడు ప్రచారం చేసిందని ఆమె నిందించారు.

ఈ–మెయిల్‌ వివాదాన్ని పెద్ద తప్పుగా పేర్కొంటూ అమెరికన్ మీడియా అనవసర రాద్ధాంతం చేసిందని ఆమె పేర్కొన్నారు. అలాగే తనపై విమర్శల సమయంలో సొంత పార్టీ సభ్యులు పెద్దగా స్పందించలేదని, ట్రంప్ పై ఎదురుదాడికి దిగలేదని ఆమె చెప్పారు. జాతీయ దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ వ్యవహార శైలి కూడా తన ఓటమిలో ప్రధాన భూమిక పోషించిందని ఆమె చెప్పారు. అయితే ఎన్నికల ప్రచారంలో తీసుకున్న ప్రతి నిర్ణయానికి తానే బాధ్యురాలినని, వాటివల్ల మాత్రం ఓడిపోలేదని ఆమె పేర్కొన్నారు.

ఇక దీనిపై ట్రంప్ స్పందిస్తూ, మోసకారి హిల్లరీ తన ఓటమికి ప్రతి ఒక్కరినీ నిందిస్తున్నారని మండిపడ్డారు. తాను మాత్రం భయంకరమైన అభ్యర్థినని ఆమె అంగీకరించడం లేదని ట్రంప్ ట్వీట్ చేశారు. ఫేస్ బుక్, మీడియాను కూడా వారు ఆడిపోసుకుంటున్నారని ఆయన అన్నారు. అంతే కాకుండా తన ప్రచార బృందానికి రష్యాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ డొమొక్రాటిక్‌ పార్టీ తన ఓటమికి సాకులు చెబుతోందని ఆయన తన ట్వీట్ లో విమర్శించారు.

  • Loading...

More Telugu News