: ట్విట్టర్‌లో తడబడిన కాంగ్రెస్.. తప్పుడు హ్యాష్‌టాగ్‌తో ప్రచారం.. ‘తెలంగాణ’లో అక్షర దోషం!
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఆ రాష్ట్ర స్పెల్లింగ్‌ను మాత్రం మర్చిపోయింది. ఎలా రాయాలో తెలియక చివరికి చేపట్టిన కార్యాన్ని బూడిదలో పోసిన పన్నీరు చందంగా మార్చింది. ఇంతకీ ఏమైందంటే.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో నిర్వహించిన తెలంగాణ ప్రజాగర్జన యాత్రకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరయ్యారు. అంతకుముందు ఆయనతో రోడ్ షో నిర్వహించాలని ప్లాన్ చేశారు. రాహుల్ రోడ్ షో, తెలంగాణ ప్రజా గర్జన సభ గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల దృష్టిని ఆకర్షించాలని నిర్ణయించారు. ఇందుకోసం ట్విట్టర్‌లో #RGwithTelengana #LandGrab #తెలంగాణప్రజాగర్జన పేరుతో ప్రచారాన్ని ఓ రేంజ్‌లో నిర్వహించారు. అంతవరకు బాగానే ఉన్నా, అందులోని అక్షర దోషాన్ని గమనించలేకపోయారు. Telanganaకు బదులు Telenganaగా రాశారు. దీంతో ఆ పేరుతో ఇండియా మ్యాప్‌లో ఎటువంటి ప్రదేశం లేకపోవడంతో లొకేషన్ చూపించడంలో విఫలమైంది.
అంతేకాదు.. కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా తెలంగాణ ప్రజా గర్జనకు మద్దతుగా ట్వీట్ చేశారు. తెలంగాణలో విద్యారంగం భ్రష్టు పట్టిపోయిందని, యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన కేజీ టు పీజీ ఉచిత విద్యా విధానాన్ని అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ #RGwithTelengana #తెలంగాణప్రజాగర్జన హ్యాష్ ట్యాగ్‌ను జోడించారు. ఆయన కూడా అదే తప్పు చేయడం విమర్శలకు దారితీస్తోంది. కాగా, మధ్యలో తప్పును గుర్తించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.