: ఏపీకి శుభవార్త....7న రాష్ట్రానికి రుతుపవనాలు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శుభవార్త చెప్పింది. ఇప్పటికే కేరళ రాష్ట్రాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు ఈ నెల 7 తరువాత రాష్ట్రాన్ని తాకనున్నాయని తెలిపింది. తొలుత రాయలసీమను తాకే రుతుపవనాలు ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని పేర్కొంది. రాయలసీమ నుంచి కోస్తాకు విస్తరించేందుకు రెండు రోజుల సమయం పడుతుందని ఇస్రో తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాడ్పులు ఇక ఉండవని, అయితే వేడిగాలులు మాత్రం వీస్తాయని చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా 41 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండటంతో తీవ్రమైన వేడి 23 మండలాలను వేధిస్తుండగా, మధ్యస్థ వేడి 66 మండలాల్లో ఉందని విపత్తు నిర్వహణాధికారులు తెలిపారు. మరో 319 మండలాల్లో ఉక్కపోతలు అధికంగా ఉన్నాయని వారు వెల్లడించారు.