: మ్యూజిక్ ప్రాక్టికల్స్‌లో స్టేట్ టాపర్ .. లతా మంగేష్కర్ ఎవరో మాత్రం తెలియదు!


బీహార్‌లో స్టేట్ టాపర్ల విషయంలో వెలుగులోకి వస్తున్న విషయాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. గతేడాది రుబీ రాయ్ విషయం సంచలనం కాగా తాజాగా మ్యూజిక్ ప్రాక్టికల్స్‌లో టాపర్‌గా నిలిచిన గణేశ్ కుమార్ వివాదాస్పదంగా మారాడు. ప్రొడిగల్ సైన్స్‌లో వంట నేర్పిస్తారంటూ అప్పట్లో రుబీరాయ్ చెప్పడంతో అందరి దృష్టి అటు మళ్లింది. ఇప్పుడు 12వ తరగతి విద్యార్థి గణేశ్ కుమార్ తీరు మరోమారు బీహార్ విద్యావ్యవస్థను వేలెత్తి చూపిస్తోంది.

మ్యూజిక్ ప్రాక్టికల్స్‌లో 70 మార్కులకు గాను 65 మార్కులు సాధించిన గణేశ్ చిన్నపిల్లలు కూడా చెప్పగలిగే అతి సాధారణ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కళ్లు తేలేశాడు. స్టేట్ టాపర్‌గా నిలిచిన అతడిని ఇంటర్వ్యూ చేసిన ఓ జాతీయ చానల్,  అతడు చెప్పే సమాధానాలు విని బిత్తరపోయింది. బాలీవుడ్ నేపథ్య గాయని లతా మంగేష్కర్‌ను ‘మైథిలి కోకిల’ అంటారని గణేశ్ పేర్కొన్నాడు. నిజానికి ఫోక్ సింగర్ శారద సిన్హాను అలా పిలుస్తారు. ఆమెది గణేశ్ చదువుకుంటున్న సమస్తిపూరే కావడం గమనార్హం. ఇక సంగీతంలో మొట్టమొదట నేర్పే ‘సుర్’, ‘తాళ్’, ‘మంత్ర’ల గురించి కూడా చెప్పలేకపోయాడు. కొన్ని బాలీవుడ్ పాటలను ఇష్టం వచ్చినట్టు పాడి సంగీతంపై విరక్తి పుట్టేలా చేశాడు.

ఇటీవల నిర్వహించిన బోర్డ్ ఎగ్జామ్స్‌లో 82.6 శాతం మార్కులతో స్టేట్ టాపర్‌గా నిలిచిన 24 ఏళ్ల గణేశ్ హిందీలో 92, మ్యూజిక్‌లో 82, సోషల్‌లో 42 శాతం మార్కులు సాధించాడు. గణేశ్ కుమార్ వ్యవహారంపై ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి అశోక్ చౌదరి స్పందిస్తూ.. మీడియా చిన్న విషయాన్ని పెద్దగా చేసి చూపిస్తోందని విమర్శించారు. గణేశ్‌ను ప్రశ్నలడిగిన మీడియా ప్రతినిధి తనను తాను గొప్ప మ్యుజీషియన్‌గా భావిస్తున్నట్టు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News