: చెన్నై సిల్క్స్ దుర్ఘటన: బంగారం, వెండి, వజ్రాలు, దుస్తులు ... మొత్తం 300 కోట్ల రూపాయల ఆస్తి ఆహుతి!
150 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతను 24 గంటలపాటు భరించలేక ఏడంతస్తుల చెన్నైలోని టీ.నగర్ లోని ‘చెన్నై సిల్క్స్’ భవనం పేకమేడలా కుప్పకూలింది. మొన్న వేకువ జామున చెన్నై సిల్క్స్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. సిబ్బంది అప్రమత్తమయ్యేలోపు షాపింగ్ మాల్ మొత్తం మంటలు అలముకోవడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి 12 మందిని స్కైలిఫ్ట్ సాయంతో రక్షించారు. అనంతరం 160 ఫైరింజన్లతో 250 మంది అగ్నిమాపక సిబ్బంది, చెన్నై సిల్క్స్ షాపింగ్ మాల్ సిబ్బంది, స్థానికులు, పోలీసులు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఈ అగ్ని ప్రమాదంలో 300 కోట్ల రూపాయల మేరకు ఆస్తినష్టం సంభవించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
బుధవారం వేకువజాము నుండి రాత్రి దాకా ఆ ఏడంతస్తుల భవనంలో అగ్నిజ్వాలలకు 400 కేజీల బంగారు ఆభరణాలు, 2 వేల కిలోల వెండి నగలు కరిగి బుగ్గిపాలయ్యాయి. 20 కోట్ల రూపాయల విలువైన వజ్రాభరణాలు సైతం మాడిమసయ్యాయి. మొదటి అంతస్తు నుంచి ఆరో అంతస్తు వరకు భద్రపరచిన 80 కోట్ల రూపాయలకు పైగా విలువైన దుస్తులు సైతం కాలిబూడిదయ్యాయి. అయితే రెండవ అంతస్తు నుంచి పై అంతస్తులన్నీ కుప్పకూలడంతో మిగిలిన బిల్డింగ్ ను కూడా కూల్చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది.