: తాళికట్టు శుభవేళ వింత ఘటన.. అన్నను తోసేసి వధువు మెడలో తాళి కట్టేసిన తమ్ముడు!
తమిళనాడులో వేలూరు జిల్లా తిరుపత్తూరు తాలుకా సెల్లరపట్టి గ్రామంలో ఓ పెళ్లి వేడుక జరుగుతోంది. వేద మంత్రాల నడుమ పెళ్లి తంతు కొనసాగుతోంది. ఇక తాళికట్టు నాయనా.. అని పురోహితుడు చెప్పారు. వరుడు తాళిబొట్టు కట్టబోతుండగా సరిగ్గా అదే సమయంలో పక్కనే ఉన్న అతడి తమ్ముడు ఒక్కసారిగా అతడిని పక్కకు తోసేశాడు. తన వెంట తెచ్చుకున్న మరో తాళిని పెళ్లి కుమార్తె మెడలో కట్టి పెళ్లి పెద్దలందరికీ షాక్ ఇచ్చాడు. ఊహించని ఈ పరిణామంతో అంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు.
మరిన్ని వివరాల్లోకి వెళితే, సెల్లరపట్టి గ్రామానికి చెందిన కామరాజ్ కు రంజిత్, రాజేష్, వినోద్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో రెండో, మూడో కుమారులు రాజేష్, వినోద్ తిరుప్పూరులోని ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. ఆరు నెలల క్రితం రాజేష్‌కు పెద్దలు మధురైకి చెందిన ఒక యువతితో పెళ్లి సంబంధం కుదిర్చారు. అయితే, రాజేష్ కి, ఆ యువతికి పెళ్లి చూపులు జరుగుతుండగా అతడి తమ్ముడు వినోద్ ఆ అమ్మాయి మీద మనసు పారేసుకున్నాడు.
వినోద్ మాత్రమే కాదు, ఆ అమ్మాయి కూడా అతడిపై ప్రేమను పెంచుకుంది. ఆ సమయంలోనే ఇద్దరూ ఒకరి ఫోన్ నెంబరు మరొకరు తీసుకున్నారు. ప్రతిరోజు ఎవ్వరికీ తెలియకుండా మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం కనిపెట్టలేని పెద్దలు వినోద్ అన్న రాజేష్‌కి ఆమెను ఇచ్చి పెళ్లి చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. చివరికి పెళ్లి పందిట్లో అన్నను కాదని ... తాను ప్రేమించిన యువతి మెడలో వినోద్ తాళి కట్టేశాడు. దీంతో హతాశులైన పెద్దలు వినోద్ ని పట్టుకుని చితకబాదారు. అప్పుడు తెలిసింది, వారి ప్రేమ సంగతి! ఇక చేసేదేమీ లేక నవ దంపతులపై పెద్దలంతా అక్షితలు చల్లి ఆశీర్వదించారు.