: భారత ఐటీ రంగం కుదేలు కాకుండా ఉండేందుకు నారాయణ మూర్తి కీలక సూచనలు
భారత ఐటీ రంగం కుదేలు కాకుండా ఉండేందుకు ఇన్ఫీ వ్యవస్థాపకులు ఎన్.ఆర్.నారాయణ మూర్తి పలు సూచనలు చేశారు. ప్రస్తుతం భారత్ ఐటీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్న నేపథ్యంలో ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ప్రస్తుతం ఈ పరిస్థితులను చూసి కంగారుపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఈ పరిస్థితులను అధిగమించడానికి ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని, సీనియర్ల వేతనాల్లో కోత విధించాలని అన్నారు. ఉద్యోగుల తొలగింపుపై మాత్రం మానవీయ కోణంలో ఆలోచించాలని అన్నారు. ఉద్యోగులు ఏ సంస్థలో ఆనందంగా ఉంటారో అదే స్థిరమైన కార్పొరేట్ సంస్థ అని పేర్కొన్నారు.
ఐటీ సంస్థల యాజమాన్యాలు తమ పెట్టుబడిదారి విధానాల్లో కొంత పట్టువిడుపులను ప్రదర్శించాలని నారాయణ మూర్తి చెప్పారు. దేశీయ ఐటీ పరిశ్రమ ఇటువంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడం ఇదేమీ కొత్తేమీ కాదని అన్నారు. ఆయా సంస్థల సీనియర్లు చిన్న చిన్న మార్పులకు ఒప్పుకోవాలని, యువతకు ఉద్యోగాలు పోవని ఆయన సూచించారు. తాము ఇటువంటి చర్యలనే డాట్‌కామ్ సంక్షోభంలో అనుసరించినట్లు చెప్పారు. అంతేకానీ ఉద్యోగులను భయపెట్టడం మంచి పద్ధతికాదని అన్నారు. యువతను సుశిక్షితులను చేయాలని చెప్పారు.