: టీమిండియాకు కొత్త కోచ్ గా టామ్ మూడీ?
గతంలో శ్రీలంక జట్టుకు కోచ్ గా వ్యవహరించడంతో పాటు, ఉపఖండంలో పిచ్ పరిస్థితులపై అవగాహన కలిగివున్న టామ్ మూడీ భారత జట్టుకు కోచ్ గా ఎంపిక కానున్నారా? గతంలో తృటిలో ఈ పదవికి ఎంపిక కాలేకపోయిన ఆయన్ను ఈ దఫా ఎంపిక చేసే చాన్స్ అధికంగా ఉందని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించడం గమనార్హం. భారత క్రికెట్ కోచ్ గా ప్రస్తుతం అనిల్ కుంబ్లే కొనసాగుతుండగా, ఆయన కాంట్రాక్టు ముగింపు దశకు వచ్చిన సంగతి తెలిసిందే.
జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనిల్ కుంబ్లేల మధ్య విభేదాలు రాగా, టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుకు మాజీ క్రికెటర్ల నుంచి మంచి స్పందన వస్తుందని భావించిన బీసీసీఐకి నిరాశను కలిగిస్తూ, చాలా మంది దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు. ఈ పదవికి మూడీ దరఖాస్తు చేయడం, కుంబ్లే తొలగింపు తప్పనిసరైతే, మూడీ మినహా మరో వ్యక్తికి అవకాశం దక్కకపోవచ్చని బీసీసీఐ పెద్దలు చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది.