: తెలంగాణ సంబురాలకు వేళాయె... అదిరిపోయేలా ఏర్పాట్లు!
మూడు రోజుల పాటు నోరూరించే తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్, ప్రధాన రహదారులపై విద్యుద్దీప కాంతులు, చెట్లపై లైటింగ్, వివిధ ఆఫీసుల అలంకరణ, లుంబినీ పార్క్, ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక ఉత్సవాలు... మూడు సంవత్సరాల తెలంగాణ సంబురాలకు అదిరిపోయే ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 2న ఈ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు కేసీఆర్ ప్రభుత్వం పట్టుదలతో ఉండగా, విద్యుత్ అలంకరణ పనులు చకచకా సాగుతున్నాయి.
ఇక ఈ ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ టూరిజం ప్రత్యేక ఫుడ్ ఫెస్టివల్ ను పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసింది. హైదరాబాద్ లోని ప్రముఖ ప్రదేశాలను అతిథులకు, టూరిస్టులకు తిప్పి చూపించేలా ఎయిర్ కండిషన్డ్ బస్సులను సిద్ధం చేశామని టూరిజం కార్పొరేషన్ ఎండీ క్రిస్టినా వెల్లడించారు. కాచిగూడ రైల్వే స్టేషన్, శిల్పకళా వేదిక తదితర ప్రాంతాల వద్ద 3డీ లైటింగ్ ను ఏర్పాటు చేయనున్నట్టు టూరిజం మంత్రి అజ్మీరా చందూలాల్ వెల్లడించారు. అన్ని ప్రభుత్వ భవనాలనూ ప్రత్యేక లైటింగ్ తో అలంకరించనున్నట్టు తెలిపారు. 2వ తేదీ రాత్రి ట్యాంక్ బండ్ పై సుమారు గంట పాటు కళ్లు మిరుమిట్లు గొలిపే బాణసంచా పేలుళ్లు ఈ ఉత్సవాలకు ప్రధాన ఆకర్షణ కానున్నాయి.