: నా కొడుకు, కోడలు ఉన్నత విద్యావంతులు...రిటైరయ్యాక వారే నాకు తిండి పెడతారు: చంద్రబాబు సరదా వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్ధక్యంలో ఏం చేస్తారన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? నిత్యం పని పని అని తపించే చంద్రబాబునాయుడు గురించి అలాంటి ఆలోచన ఎవరికీ వచ్చి ఉండదు కానీ... స్వయంగా ఆయనకే వచ్చినట్టుంది. విద్య ఆవశ్యకతను వివరిస్తూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిల్లలను చదివించాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపైన ఉందని అన్నారు. సాధారణంగా రాజకీయ నాయకుల పిల్లలు చదువుల్లో గొప్ప ప్రతిభ కనబర్చరు. అయితే తాము మాత్రం అలా కాకాకుండా పిల్లలను బాగా చదివించాలని భావించామని తెలిపారు.
అందుకే ఉత్తమమైన విద్యనభ్యసించేందుకు లోకేష్ ను స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో చదివించామని ఆయన చెప్పారు. తమ ఇంట్లోని వారంతా ఉన్నత విద్యావంతులేనని ఆయన అన్నారు. తన కొడుకు, కోడలు బాగా చదువుకున్నారని, అలాగే బాగా సంపాదిస్తున్నారని, రిటైర్ అయ్యాక తన శేషజీవితం వారి దగ్గరే గడుస్తుందని, వారే తనకు తిండి పెడతారని చంద్రబాబునాయుడు సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో అంతా పెద్దగా నవ్వేశారు.