: ఛీ.. పో.. అన్నారు... ఎందుకూ పనికిరావన్నారు...: కన్నీటి పర్యంతమైన సివిల్స్ టాపర్!


'కృషి  ఉంటే మనుషులు రుషులవుతారు...మహాపురుషులౌతారు...' అంటూ తన గేయంలో వేటూరి రాసిన మాటలను శ్రీకాకుళానికి చెందిన యువకుడు నిజం చేసి చూపించాడు. తెలుగు మీడియం బ్యాక్ గ్రౌండ్ తో సివిల్స్ సాధించి సత్తా చాటాడు. యూపీఎస్సీ పరీక్ష ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన రోణంకి గోపాలకృష్ణ సివిల్స్ కు ప్రిపేర్ అవుతానంటూ హైదరాబాదులో అడుగుపెట్టిన సమయంలో ఎదుర్కొన్న ఛీత్కారాలను గుర్తు చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ లోని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పారసంబకు చెందిన రోణంకి అప్పారావు, రుక్మిణిల రెండవ సంతానమైన రోణంకి గోపాలకృష్ణ పాఠశాల విద్య నుంచి ఇంటర్‌ వరకూ తెలుగు మీడియంలోనే చదివారు. ఆంధ్రాయూనివర్సిటీ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్ నుంచి బీఎస్సీ (ఎంపీసీ) పట్టా పుచ్చుకున్నారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా దూబచర్లలోని డైట్‌ లో టీటీసీ ట్రైనింగ్ అయ్యారు. 2007లో డీఎస్సీ రాసి సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) గా ఎంపికై, రేగులపాడులో టీచర్ గా పని చేస్తున్నారు. సివిల్స్ కు కోచింగ్ తీసుకుంటే ఫలితముంటుందని ఆరు నెలల క్రితం ఆయన హైదరాబాదు చేరుకున్నారు.

వచ్చీ రాగానే కోచింగ్ కోసం పలు సెంటర్లను ఆశ్రయించారు. ఈ సమయంలో ఆయన ఎన్నో అవమానాలు, చీత్కారాలు ఎదుర్కొన్నారు. తెలుగు మీడియం విద్యార్థి కావడంతో... ఏ కోచింగ్‌ సెంటర్‌ కు వెళ్లినా సివిల్స్ కు నువ్వు పనికిరావంటూ అడ్మిషన్‌ ఇవ్వడానికే నిరాకరించారని గోపాలకృష్ణ తెలిపారు. అయినా సరే, దేవుని దయ, అమ్మానాన్నల దీవెనలు, అన్నయ్య కోదండరావు (ఎస్బీఐ ఉద్యోగి) స్పూర్తి, స్నేహితుల సహకారంతో పట్టుదలతో చదువుకున్నానని తెలిపారు. తమ ఊరికి కరెంట్‌ లేకపోతే దీపం వెలుగులో చదువుకున్నానని, ఇప్పటికీ తమ ఊరికి న్యూస్‌ పేపర్‌ అంటే ఏమిటో తెలియదని ఆయన తెలిపారు. తన తండ్రి నిమ్నకులానికి చెందిన వారిన ఇంట్లో భోజనం చేశాడని నిందిస్తూ గ్రామం నుంచి తమ కుటుంబాన్ని వెలివేశారని, అప్పటి నుంచి తమ కుటుంబంతో ఊర్లోని వారు ఎవరూ మాట్లాడరని ఆయన గతాన్ని గుర్తుచేసుకున్నారు.  25 ఏళ్లుగా తమ కుటుంబం ఈ శిక్ష అనుభవిస్తోందని ఆయన చెప్పారు.  

జీవితంలో ఏదో సాధించాలన్న లక్ష్యంతో కష్టపడి చదివానని ఆయన అన్నారు. తెలుగులో చదువుతానని, తెలుగులో పరీక్ష రాస్తానంటే అంతా నవ్వారని ఆయన తెలిపారు. శ్రీకాకుళం వెళ్లిపోమ్మన్నారని, ఇలాంటి ఎన్నో అవమానాలు ఎదుర్కొని తాను చదువుకున్నానని ఆయన చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో చదువుకున్న తనకు ఈ ఫలితం చాలా ఆనందాన్నిచ్చిందని ఆయన తెలిపారు. ఆల్ ఇండియా స్థాయిలో థర్డ్ ర్యాంక్ రావడం గర్వకారణమని అతని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News