: నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945లోనే మరణించారు: కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం
ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పింది. కోల్ కతాకు చెందిన ఓ వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతి వివరాలు కావాలంటూ సమాచారహక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తికి సమాధానమిచ్చిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945లోనే విమాన ప్రమాదంలో చనిపోయారని స్పష్టం చేసింది. షానవాజ్ కమిటీ, జస్టిస్ జీడీ ఖోస్లా కమిషన్, జస్టిస్ ముఖర్జీ కమిషన్ ల నివేదికల్లోని సమాచారాన్ని విశ్లేషించిన తరువాతే తాము నేతాజీ 1945లో మరణించారనే నిర్ధారణకు వచ్చామని కేంద్ర హోం శాఖ వెల్లడించింది.
అంతే కాకుండా గుమ్నమి బాబాగా నేతాజీ మారువేషంలో జీవించారనే వాదననను కూడా అధికారులు కొట్టిపారేశారు. కాగా, దీనిని నేతాజీ కుటుంబ సభ్యులు ఖండించారు. స్పష్టమైన ఆధారాలు లేకుండా నేతాజీ మరణించారని కేంద్రం ఎలా చెబుతుందని ప్రశ్నిస్తున్నారు. కాగా, బెంగాల్ లో గతంలో బీజేపీ నేతాజీ మరణంపై, రహస్య దస్త్రాలపై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.