: నోయిడాలో మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను కాల్చి చంపిన యువకుడు!
ఢిల్లీ సమీపంలోని నోయిడాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను ఓ దుండగుడు కాల్చి చంపాడు. అక్కడ ఉన్న సీసీ టీవీలో ఆ దృశ్యాలు నమోదయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానా యమునా విహార్‌కు చెందిన యువతి అంజలీ రాథోడ్ (23) ఇటీవలే నోయిడాలోని లావా మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. అదే ప్రాంతంలో ఆరుగురు యువతులతో కలిసి శతాబ్ది విహార్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆమె ఉంటోంది.
ఓ ఫోన్ కాల్ మాట్లాడుతూ ఆమె తాను ఉంటున్న అపార్ట్‌మెంట్ బేస్‌మెంట్ వద్దకు వచ్చింది. అదే సమయంలో మొహానికి ముసుగు ధరించి వచ్చిన ఓ యువకుడు తుపాకీతో ఆమెను కాల్చేశాడు. ఆ యువతిని స్నేహితులు ఆసుపత్రికి తరలించగా, ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు చెప్పారు. ఆ యువతికి తన బాయ్‌ఫ్రెండ్ నుంచి ఫోన్ రావడంతో సెల్లార్ కు వెళ్లిందని, అదే సమయంలో ఈ హత్య జరిగిందని ఆమె స్నేహితులు పోలీసులకు తెలిపారు.