: తాను వచ్చిన పనిని ఒక గంటలో కానిచ్చేసి విమానంలో పారిపోతాడు... ఎట్టకేలకు 'ఎగిరే దొంగ' అరెస్ట్!
కమారుద్దీన్ షేక్... ఇతనికి పోలీసులు పెట్టుకున్న పేరు 'ఎగిరే దొంగ'. ముంబై నుంచి ఓ నగరానికి విమానంలో వచ్చి, ఆపై గంట వ్యవధిలో దొంగతనం చేసి, అంతే వేగంతో తిరుగు ప్రయాణం అవుతూ నాలుగు రాష్ట్రాల పోలీసులకు నిద్ర లేకుండా చేసిన గజదొంగ. ముంబై నివాసి అయిన కమారుద్దీన్ ను ఎట్టకేలకు ఎర్నాకుళం పోలీసులు అరెస్ట్ చేశారు. కమారుద్దీన్ గురించిన మరిన్ని వివరాలను కొచ్చి, నెండుబాసరే పోలీస్ అధికారి పీఎం బైజూ వెల్లడించిన వివరాల ప్రకారం, కమారుద్దీన్ అంధేరీలో నివాసం ఉంటున్నాడు. గదుల తాళాలు తీయడంలో సిద్ధహస్తుడు. దర్జాగా విమానంలో ఎయిర్ పోర్టులో దిగిన అరగంటలో తిరుగు విమానానికి టికెట్ బుక్ చేసుకుని, ఆపై క్యాబ్ బుక్ చేసుకుని ముందుగా తాను ఎన్నుకున్న స్టార్ హోటల్ కు వెళ్తాడు.
సూటు, బూటు వేసుకుని హోటల్ కు వెళ్లి, అక్కడ తాళాలు వేసివున్న గదుల్లోకి చొరబడి అందినంత దోచుకుని, అంతే వేగంతో తిరిగి ముంబైలో వాలిపోతాడు. హోటల్ సీసీ కెమెరాల్లో తన ముఖం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఈ సంవత్సరం జనవరి, మే, ఏప్రిల్ ఇదే తరహాలో కేరళలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేశాడు. కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లోని మెట్రో నగరాలకు వెళ్లి ఇదే తరహాలో దొంగతనాలు చేశాడు. చివరికి అతని ముఖం కొచ్చి పరిధిలోని వాపలసేరీలోని ఓ హోటల్ లో నిక్షిప్తమైంది. దీని సాయంతో తీగలాగిన కేరళ పోలీసులు ముంబైలోని అతని నివాసంలోనే అరెస్ట్ చేశాడు. సీసీటీవీలో అతని ముఖం చూడటం, అతను కొచ్చిన్ ఎయిర్ పోర్టు నుంచి క్యాబ్ బుక్ చేసుకుని ఉండటంతో, ట్రేస్ చేసి, మొబైల్ ఫోన్ కనిపెట్టి, లొకేషన్ తెలుసుకుని ముంబై పోలీసుల సాయంతో అరెస్ట్ చేశామని తెలిపారు.