: అయోధ్య రామ మందిరంలో పూజలు నిర్వహించిన యోగి... ప్రతిపక్షాల విమర్శలు!
అయోధ్యలోని వివాదాస్పద రామ జన్మభూమి ఆలయంలో రాముడికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పూజలు నిర్వహించారు. 10 నిమిషాల పాటు ఆయన స్వామివారి సేవలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత అయోధ్య రామాలయానికి యోగి రావడం ఇదే ప్రథమం. బాబ్రీ మసీదు కూల్చివేత కేసుకు సంబంధించి బీజేపీ అగ్రనేతలు అద్వాణీ, మురళీ మనోహర్ జోషిలు లక్నోలోని సీబీఐ కోర్టు ఎదుట హాజరైన మరుసటి రోజే యోగి ఇక్కడకు రావడం గమనార్హం.
మోదీ మరోసారి ప్రధాని కావడానికి 2019 ఎన్నికల్లో యూపీలో మెజార్టీ సీట్లు సాధించాల్సిన అవసరం బీజేపీకి ఉంది. బాబ్రీ మసీదు కూల్చివేత విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, హిందుత్వ అజెండాను మరింత వేగంగా జనాల్లోకి తీసుకెళ్లడానికే యోగి అయోధ్యకు వెళ్లారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు గత ఎన్నికల సమయంలో రామ మందిర నిర్మాణమే తమ ప్రధాన లక్ష్యమంటూ యోగి కూడా ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో, విపక్షాల విమర్శలపై స్పందించిన బీజేపీ నేతలు... కోర్టు వ్యవహారానికి, యోగి పూజలకు ఎలాంటి రాజకీయ సంబంధం లేదని కొట్టిపడేశారు.