: 50 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుపోయాడు: భావోద్వేగంతో కృష్ణ
దర్శకుడు దాసరి నారాయణరావుతో తనకు 50 సంవత్సరాల అనుబంధం ఉందని, ఇప్పుడు దాన్ని అర్థాంతరంగా ఇలా తెంచుకుపోతాడని తాను అనుకోలేదని సూపర్ స్టార్ కృష్ణ భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. ఈ ఉదయం దాసరి భౌతికకాయానికి తన సోదరుడు ఆదిశేషగిరిరావు, భార్య విజయనిర్మలతో కలసి నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆయన తన తొలి చిత్రానికి పని చేసినప్పటి నుంచి పరిచయం ఉందని, ఆయనిప్పుడు మన మధ్య లేరంటే తనకు చెప్పరానంత బాధ కలుగుతోందని అన్నారు. తాను హీరోగా నటించిన ఎన్నో చిత్రాలకు దాసరి డైలాగ్ రైటర్ గా పనిచేసి మాటలు రాశారని గుర్తు చేసుకున్నారు. సినీ ఇండస్ట్రీలో ఏ సమస్య ఏర్పడినా దాసరి మధ్యవర్తిగా నిలిచి ఎన్నోమార్లు తనవంతు ప్రయత్నాలు జరిపి సయోధ్యలు కుదిర్చారని చెప్పారు. ఆయన లేకపోవడం ఎంతో లోటని, ఆయన్ను రీప్లేస్ చేసే వ్యక్తి మరొకరు లేరని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.