: కాబూల్ బ్లాస్ట్ పెద్దదే... మృతుల లెక్క తేలట్లేదంటున్న అధికారులు
ఈ ఉదయం ఆఫ్ఘనిస్థాన్ లోని కాబూల్ లో భారత ఎంబసీ ముందు జరిగిన పేలుడు చాలా శక్తిమంతమైనదని, ప్రాథమిక అంచనాల ప్రకారం 40 మంది వరకూ మృతి చెందడం లేదా తీవ్రంగా గాయపడటం జరిగి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలిలో మాంసం ముద్దలు మాత్రమే కనిపిస్తూ ఉండటంతో, మరణాల లెక్క తేలట్లేదని అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి నజీబ్ దానిష్ వెల్లడించారు.
భారత దౌత్యాధికారులు క్షేమంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఆరోగ్య శాఖ ప్రతినిధి ఘటనపై స్పందిస్తూ, 60 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారని, వీరిలో అత్యధికులు ఆఫ్ఘాన్ పౌరులేనని, ఎంత మంది మరణించారన్న విషయాన్ని తదుపరి వెల్లడిస్తామని అన్నారు. కాగా, "దేవుడి దయవల్ల భారీ బాంబు దాడి తరువాత భారత దౌత్య సిబ్బంది క్షేమం" అని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. యూరప్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి పేలుడు గురించిన సమాచారాన్ని అందించినట్టు తెలిపారు. కాగా, ఈ దాడికి పాల్పడింది తామేనని ఇంతవరకూ ఏ ఉగ్ర సంస్థా ప్రకటించలేదు.