: నేడు పెట్రో వడ్డన... రూ. 2 వరకూ పెరగనున్న ధర!
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరగడంతో నేడు సమావేశం కానున్న ప్రభుత్వ రంగ చమురు సంస్థలు లీటరుకు రూ. 2 వరకూ పెట్రోలు ధరలను పెంచనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 15వ తేదీన విశాఖపట్నంలో రూ. 70 వద్ద ఉన్న లీటరు పెట్రోలు ధర ఇప్పుడు రూ. 72.24 వద్ద ఉంది. విశాఖలో రోజువారీ విధానంలో పెట్రోలు, డీజిల్ ధరలను సవరిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక విశాఖలో ధరల సరళి మారిన తీరును పరిశీలిస్తుంటే, మిగతా ప్రాంతాల్లో నేడు ధర పెంచుతూ ప్రకటన విడుదల చేయడం ఖాయంగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఐదు నగరాల్లో ప్రయోగాత్మకంగా పెట్రోలు ధరలను ప్రతి రోజూ సవరిస్తున్న చమురు సంస్థలు, మిగతా ప్రాంతాల్లో పక్షం రోజులకోసారి ధరలను మార్చుతున్న సంగతి విదితమే. ప్రస్తుతం హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర రూ. 69.80 వద్ద ఉంది. ఇక లీటరు డీజిల్ ధర కూడా రూ. 1.50 వరకూ పెరగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.