: పైలట్లు నిద్రించారు.. ఎయిర్ హోస్టెస్ నడిపారు
ఇద్దరు పైలట్లు తమ విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 166 మంది ప్రయాణికుల ప్రాణాలను 33వేల అడుగుల ఎత్తులో గాలిలో దీపంలా మార్చేశారు. బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో 166 మంది ప్రయాణిస్తున్నారు. విమానం బ్యాంకాక్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటి తర్వాత కో పైలట్ రవీంద్రనాథ్ బాత్ రూమ్ కు వెళుతున్నానంటూ ఒక ఎయిర్ హోస్టెస్ జె.భట్ ను పిలిచి తన సీటులో కూర్చోమన్నాడు. ఇంకొంత సేపటికి పైలట్ కూడా లేచి తన స్థానంలో కనికా కళ అనే మరో హోస్టెస్ ను పిలిచి 'టేక్ సీట్' అన్నాడు. ఇద్దరు హోస్టెస్ కు విమానం ఎలా నడపాలో కొద్ది సేపు చెప్పాడు.
అనంతరం ఆటో పైలట్ సిస్టం ను ఆన్ చేసి వెళ్లి బిజినెస్ క్లాస్ లో ప్రయాణికుల్లా ఇద్దరు పైలట్లు పడకేశారు. అలా 40 నిమిషాల పాటు నిద్రపోయారు. అందిందే అవకాశం అన్నట్లు ఎయిర్ హోస్టెస్ ఎలాగోలా మేనేజ్ చేశారు. అయితే వారిలో ఒక అమ్మడు 40 నిమిషాల తర్వాత ఆటో పైలట్ ను ఆఫ్ చేసింది. అంతే విమానం గతి తప్పుతుండడంతో పైలట్లు నిద్ర మత్తు వీడి మళ్లీ సీట్లలోకి వచ్చేశారు. ఇదంతా చూసిన కేబిన్ క్రూ ఉద్యోగి ఎయిర్ ఇండియా ఉన్నతాధికారులకు విషయం చేరవేశాడు. దాంతో నలుగురిపై సస్పెన్షన్ వేటు పడింది. ఏప్రిల్ 12 న జరిగిన ఈ భయంకర ఘటనను ఎయిర్ ఇండియా అధికారి ఒకరు బయటపెట్టారు.