: పద్మ మరణంతో కుదేలైన దాసరి... ఆమె చెంతనే శాశ్వతనిద్ర!


సినీ వినీలాకాశంలో మరో ధ్రువతార రాలిపోయింది. ఎందరో నటీనటులకు వెండితెరపై వెలిగే భాగ్యాన్ని కల్పించిన దాసరి నారాయణ రావు ఇకలేరన్న వార్తను తెలుసుకుని కళామతల్లి కన్నీరు పెడుతోంది. వాస్తవానికి 2011, అక్టోబర్ 28న ఆయనకు తోడు నీడగా నిలిచిన పద్మ కన్నుమూసిన తరువాత మానసికంగా కుదేలైపోయారు. ఎన్నో చిత్రాలకు దాసరి దర్శకత్వం వహిస్తుండగా, ఆ భారం తన భర్తపై పడకుండా పద్మ నిర్మాతగా వ్యవహరించి, ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తుండే వారు. దాసరి దర్శకత్వం వహించిన శివరంజని, ఒసేయ్‌ రాములమ్మ, మజ్ను, ఒరేయ్‌ రిక్షా, మేఘసందేశం వంటి పలు చిత్రాలకు ఆమె నిర్మాతగా ఉన్నారు. సొంతడబ్బు ఖర్చు పెట్టి మరీ సామాజిక కార్యక్రమాలు నిర్వహించే ఆమంటే, చెన్నై ఆటో కార్మికుల సంఘానికి ఎంతో గౌరవం. ఆటో డ్రైవర్ కాకున్నా ఆ మంచిగుణమే పద్మను ఆటో సంఘానికి అధ్యక్షురాలిని చేసింది.

పద్మ మరణించిన నాడు దాసరి చిన్న పిల్లాడిలా ఏడుస్తుంటే, ఆయన్ను ఓదార్చటం ఎవరి తరమూ కాకపోయింది. అప్పటివరకూ తనను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన జీవిత భాగస్వామి దూరం కావడంతో దాసరి కోలుకోలేకపోయారు. సమయానికి మందులు వేసుకోక, ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసి క్రమంగా రోగాల బారిన పడిపోయారు. 20 రోజుల నాడు తన పుట్టిన రోజు వేడుకల రోజున కూడా దాసరి నారాయణరావు తనకు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన వారి వద్ద పద్మను తలచుకున్నారు. ఆమె ఉంటే, తన పుట్టిన రోజును ఎలా పండగలా జరిపేదో గుర్తు చేసుకున్నారు.

ఆనాడు పద్మ అంత్యక్రియలు మొయినాబాద్‌ మండలం తోల్‌ కట్ట సమీపంలోని సొంత ఫాంహౌస్ లో జరుగగా, అప్పటి నుంచి ఎన్నో మార్లు దాసరి అక్కడికి వెళ్లి ఆమె జ్ఞాపకాల్లో గంటల సమయాన్ని గడుపుతూ ఉండేవారు. ఇప్పుడాయన తన ప్రియాతి ప్రియమైన పద్మ దగ్గరికే వెళ్లాపోయారు. నేడు దాసరి కూడా అదే ప్రాంతంలో శాశ్వతంగా నిద్రపోనున్నారు.

  • Loading...

More Telugu News