: ఇకపై మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి?: కన్నీరుమున్నీరైన సుద్దాల అశోక్ తేజ!
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఆకస్మిక మృతి పట్ల ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ సంతాపం వ్యక్తం చేశారు. దాసరి నివాసంలో ఆయన పార్థివ దేహాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన కన్నీరుమున్నీరయ్యారు. 25 ఏళ్ల తన సినీ ప్రస్థానంలో దాసరితో ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. కష్టంలో, బాధతో దాసరి కాంపౌండ్ లో అడుగుపెడితే... ఉపశమనంతో ఇంటికి వెళ్లేవాళ్లమని తెలిపారు. కష్టం, కన్నీరు చూస్తే ఆయన అండగా నిలబడేవారని ఆయన చెప్పారు.
ఎంతోమందికి ఆయన ఇచ్చిన ప్రోత్సాహం సినీ పరిశ్రమ నిలబడేందుకు దోహదపడిందని ఆయన చెప్పారు. దాసరి కథ, మాట, పాట ఎంతో మందికి స్పూర్తినిచ్చాయని ఆయన చెప్పారు. ఇన్నేళ్లుగా గూడుకట్టుకున్న బంధం ఒక్కసారిగా తెగిందంటే నమ్మబుద్ధి కావడం లేదని ఆయన చెప్పారు. సినీ పరిశ్రమకు లోటు ఒక ఎత్తైతే... ఇకపై కష్టం కలిగితే సినీ కుటుంబం ఎవరికి చెప్పుకోగలుగుతుందని ఆయన అన్నారు. సినీ పరిశ్రమలో ఎంతో మందికి దాసరి పెద్దదిక్కు అని ఆయన అన్నారు. దాసరి ఎంతోమందికి కుటుంబ సభ్యుడని ఆయన తెలిపారు. దాసరి లాంటి బహుముఖ ప్రజ్ఞాశీలి అరుదుగా ఉంటారని ఆయన అన్నారు.