: విపక్షాల ఐక్యతలో మరో మెట్టు.. కరుణానిధి బర్త్ డేకు నితిశ్ కుమార్
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధి పుట్టిన రోజు వేడుకలకు బీహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ హాజరు కానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. విపక్షాల ఐక్యత కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది మరో అడుగని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు.. ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చిన విందుకు గైర్హాజరైన నితిశ్.. మారిషస్ ప్రధాని గౌరవార్థం ప్రధాని మోదీ ఇచ్చిన విందుకు హాజరై కలకలం రేపారు.
అనంతరం మోదీతో సమావేశమయ్యారు. దీంతో ఆయన బీజేపీకి స్నేహ హస్తం చాచినట్టు వార్తలు వినిపించాయి. దీనిపై స్పందించిన నితిశ్ తమ భేటీలో కొత్తదనమేమీ లేదని, తమది ప్రధాని-ముఖ్యమంత్రి భేటీ మాత్రమేనని స్పష్టంచేసి ఊహాగానాలకు తెరదించారు. కాగా, జూన్ 3 జరగనున్న కరుణానిధి జన్మదిన వేడుకలకు అనారోగ్య కారణాలతో సోనియా హాజరుకావడం లేదు. ఆమె స్థానంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. మరోవైపు కరుణ పుట్టిన రోజు వేడుకలకు బీఎస్పీ, సమాజ్‌వాదీ పార్టీలకు డీఎంకే నుంచి ఆహ్వానం అందలేదు.