: ఆర్థిక ఇబ్బందుల నడుమ దాసరి బాల్యం.. చదువు!
కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు సినీ పరిశ్రమలో తనదైన ముద్రవేశారు. ఘనమైన సినీ నేపథ్యం కలిగిన దాసరి నారాయణరావు పాలకొల్లులో అతిసామాన్యమైన కుటుంబంలో జన్మించారు. సాయిరాజు దంపతుల సంతానంలో దాసరి మూడోవాడు. దాసరి తండ్రి సాయిరాజు, వాళ్ల పెద్దనాన్న కలిసి పొగాకు వ్యాపారం చేసేవారు. దీంతో దాసరిని మాత్రమే చదివించి, మిగిలిన వారిని తనకు సాయంగా ఉంచుకున్నారు. ఆనందంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో ఒక దీపావళి పండగ పెనుకుదుపును తెచ్చింది. దీపావళి పండుగ వేళ పొగాకు గోదాము తగలపడిపోవడంతో దాసరి కుటుంబం ఆర్థిక ఇబ్బందులు చవిచూసింది. ఆ కుదుపుతో ఉన్న ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. దీంతో దాసరి చదువును ఆరోతరగతిలో ఆపించి, వడ్రంగి పనికి పంపారు. నెలకు రూపాయి జీతంగా వడ్రంగి దుకాణంలో పని చేసిన దాసరి...ఒక మాస్టారి సహాయంతో డిగ్రీ వరకు చదువును పూర్తి చేశారు.
డిగ్రీలో ఉండగా ఆయనకు నాటకాలవైపు మనసు మళ్లింది. చిన్నచిన్న నాటకాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో అగ్ర నిర్మాతగా ఉన్న రాఘవ గారు నిర్మించిన "తాత-మనవడు" సినిమాతో దర్శకుడిగా తన సినీ ప్రస్థానం ప్రారంభించారు. అప్పటి నుంచి సుమారు 150కి పైగా సినిమాలు రూపొందించి, తెలుగు నాట తిరుగులేని దర్శకుడిగా ఆయన పేరుతెచ్చుకున్నారు. ఆయన ఆకస్మిక మరణంతో సినీ పరిశ్రమ ఒక కుటుంబ పెద్దను కోల్పోయింది. దాసరి పద్మను వివాహం చేసుకున్న దాసరి నారాయణరావుకు ముగ్గురు పిల్లలు. ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. ఇద్దరు కుమారులు సినీ పరిశ్రమలోనే ఉన్నారు. నేడు చేవెళ్ల సమీపంలోని మొయినాబాద్ లోని ఆయన ఫాం హౌస్ లో ఆయన అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరగనున్నాయి.