: ఎందరికో సినీ జీవితాన్ని ప్రసాదించిన గురువు దాసరి!
కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు మరణంతో సినీ పరిశ్రమ మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఎంతో మందికి సినీ జీవితాన్ని ప్రసాదించిన దాసరికి ఎంతో మంది శిష్యులున్నారు. ఆయన తెలుగు తెరకు 13 మంది హీరోయిన్లను, 15 మందికిపైగా హీరోలను, ఇంకా ఎంతో మంది దర్శకులు, సంగీత దర్శకులు, నృత్యదర్శకులను పరిచయం చేశారు. 'స్వర్గం-నరకం' సినిమాతో మోహన్ బాబును, 'సంగీత' సినిమాతో ఆర్.నారాయణమూర్తిని, ప్రముఖ నటుడు కృష్ణ కుమారులు రమేష్ బాబు, మహేశ్ బాబు లను 'నీడ' సినిమాతోను తెలుగు తెరకు పరిచయం చేశారు.
నర్సింహరాజు, ఈశ్వర్ రావు, బాలాజీ, హరిప్రసాద్, త్రినాథ్, క్యారెక్టర్ నటుడు జయప్రకాశ్ రెడ్డిలను వెండితెరకు పరిచయం చేశారు. తన కుమారుడు అరుణ్ కుమార్ ను 'గ్రీకువీరుడు'గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే జయసుధ, జయప్రద, మాధవి, శ్రీదేవి, సుజాత, స్వప్న, సిల్క్ స్మిత, రజినీ, శుభశ్రీ, అలేఖ్య, అన్నపూర్ణ, ఫటాఫట్ జయలక్ష్మిలకు మంచి మంచి పాత్రలనిచ్చి, తెలుగు సినీ పరిశ్రమలో వారిని తిరుగులేని నటులుగా తీర్చిదిద్దిన ఘనత దాసరి నారాయణరావుదే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎంతో మంది శిష్యులను తయారు చేసుకున్న దాసరి సినీ పరిశ్రమలో "గురువు"గా కీర్తించబడ్డారు.