: సినీ పరిశ్రమ దారులన్నీ దాసరి నివాసానికే!
1942 మే 4న జన్మించిన తెలుగు సినీ దిగ్గజం దాసరి నారాయణరావు మరణం సినీ పరిశ్రమను కలచివేసింది. 1972లో వచ్చిన తాతా మనవడు సినిమాతో దర్శకుడిగా మారిన దాసరి, ఎన్నో విప్లవాత్మక సినిమాలు తీశారు. సినీ రంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా దాసరికి పేరు. సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్టులపై ఆయనకు ఉన్న పట్టు అటువంటిదని అంతా చెబుతారు. రచయిత, దర్శకుడు, సంగీత దర్శకుడు, నిర్మాత ఇలా ప్రతి రంగంలోనూ ఆయనకు అపారమైన అనుభవం ఉంది. దాసరిది 50 ఏళ్ల సినీ ప్రస్ధానం. తెలుగు సినీ పరిశ్రమని విశ్లేషించాల్సి వస్తే... దాసరి ముందు, దాసరి తరువాత అని విశ్లేషించాల్సి ఉంటుంది.
150కి పైగా చిత్రాలను తెరకెక్కించిన దాసరి, 53 సినిమాలను నిర్మించారు. 250కి పైగా సినిమాలకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే, పాటలు అందించడం విశేషం. రెండు జాతీయ పురస్కారాలు, తొమ్మిది నంది పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు అందుకున్న గొప్ప దర్శకుడు దాసరి నారాయణరావు. కేవలం దర్శకుడిగానే కాక, అప్పట్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో హీరోలకు దీటుగా నటించి శభాష్ అనిపించుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించి ఉత్తమ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. దాసరి భార్య గతంలోనే మరణించగా, ఆయనకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ప్రభు, అరుణ్ కుమార్ ఉన్నారు.
తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా, ప్రతి సమస్యకు పరిష్కారం చూపే వ్యక్తిగా, ఎందరో సినీ ప్రముఖులకు సినీ ప్రస్థానంలో అండగా నిలిచిన వ్యక్తిగా ఆయనకు తిరుగులేని పేరుప్రతిష్ఠలున్నాయి. టాలీవుడ్ లో తలెత్తే ప్రతి సమస్యకు పరిష్కారం దాసరి... అలాంటి దాసరి ఇక లేరని తెలియడంతో సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఎందరో శిష్యులుగల దాసరిని కడచూపు చూసేందుకు సినీ పరిశ్రమ దారులన్నీ దాసరి నివాసానికే చేరుతున్నాయి. ఆయనను కడసారి చూసేందుకు అభిమానులు, సినీ పరిశ్రమ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు.