: తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ దర్శకరత్న దాసరి సినీ ప్రస్థానం!
తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డగా ఎంతో కీర్తిని గడించిన దర్శకరత్న దాసరి నారాయణ రావు ఇక లేరన్న వార్తను సినీ ప్రముఖులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న ఆయన.. సినీ పరిశ్రమలో ఎవరి మధ్య అయినా విభేదాలు వచ్చినా, వారికి సమస్యలు తలెత్తినా వెంటనే స్పందించి, తగిన పరిష్కారం చూపేవారు. నటుడు, దర్శకుడు, నిర్మాతగానే కాక మాటల రచయిత, పాటల రచయితగానూ సినీ పరిశ్రమకు ఎన్నో సేవలను అందించారు. మొత్తం 151 చిత్రాలకు దర్శకత్వం వహించిన దాసరి నారాయణ రావు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1942 మే 4న మహాలక్ష్మి, సాయిరాజ్ దంపతులకు జన్మించారు. 'తాతా మనవడు' చిత్రం ఆయన దర్శకుడిగా పనిచేసిన తొలిచిత్రం కాగా, ఆమధ్య వచ్చిన 'ఎర్రబస్సు' చిత్రం చివరిది.
దాసరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన ఎంతో మంది నటీనటులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఆయనను ఎంతో మంది దిగ్గజ నటులు తమ గురువుగా భావిస్తారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి అగ్రనటులతో సినిమాలు తీసి జాతీయస్థాయి పురస్కారాలు అందుకున్నారు. మేస్త్రీ, మామగారు సినిమాల్లో ఆయన నటనకు గానూ బెస్ట్ యాక్టర్‌గా నంది అవార్డులు వచ్చాయి. అత్యధిక సినిమాలను తెరకెక్కించిన దర్శకుడుగా ఆయన గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్నారు.