: లోకేశ్ మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు మొహంలో టెన్షన్ కనిపించింది: అంబటి రాంబాబు
టీడీపీ అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని తాము డిమాండ్ చేస్తుంటే, ఆ పార్టీ నేతలు పారిపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలకు దమ్ముంటే విచారణకు సిద్ధపడాలని వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మంత్రిగా ప్రమోట్ అయిన నారా లోకేశ్ కు సరిగా మాట్లాడడమేరాదని, మహానాడులో లోకేశ్ మైక్ పట్టుకుంటే ఆయన ఏం మాట్లాడుతారోనని చంద్రబాబు వణికిపోయారని ఆరోపించారు. లోకేశ్ సూట్‌కేసులు మోయడానికి రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు.
మహానాడులో లోకేశ్ మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు మొహంలో టెన్షన్ కనిపించిందని అంబటి వ్యాఖ్యానించారు. సరిగా మాట్లాడడమే రాని లోకేశ్ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు సవాల్ విసరడమా? అని ఆయన ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో టీడీపీ నిర్వహించిన మహానాడులో అన్నీ అసత్యాలే చెప్పారని అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని ఆయన అన్నారు. ఆనాడు ఎన్టీఆర్‌ని చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడేమో మహానాడులో ఎన్టీఆర్‌ని కీర్తిస్తున్నాడని అంబటి అన్నారు.