: పశువధ నిషేధంపై స్టే విధించిన మద్రాసు హైకోర్టు

గోవధను అరికట్టేలా దేశ వ్యాప్తంగా ఓ చట్టం తీసుకురావాలని పెద్ద ఎత్తున వస్తున్న డిమాండ్ నేపథ్యంలో ఈ మేరకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఓ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పలు రాష్ట్రాలు మండిపడుతున్నాయి. కేరళ, పశ్చిమ బెంగాల్ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అయితే, ఈ నేపథ్యంలో తమిళనాడులో పలువురు ఈ అంశంపై మద్రాసు హైకోర్టును ఆశ్రయించగా కేంద్రం విధించిన పశువుల వధ నిషేధంపై కోర్టు స్టే విధిస్తున్నట్లు తెలిపింది. ఈ స్టే నాలుగు వారాల పాటు ఉంటుందని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ తెలిపింది. ఆ లోపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.