: అలా చేసుంటే జగనే సీఎం అయ్యుండేవారు: భూమన
అమలు చేసేందుకు వీలు లేని హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టబట్టే చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చారని, అదే విధంగా జగన్ చేసుంటే, ఆయనే సీఎం అయ్యుండేవారని వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా ప్లీనరీ ప్రారంభం కాగా, భూమన మాట్లాడారు. ఏపీలో ప్రజలకు మేలు జరగాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాల్సి వుందని, అప్పుడే వైఎస్ పాలన వస్తుందని అభిప్రాయపడ్డారు.
వైకాపాకు అధికారం లభించేలా చూసేందుకు ప్రతి కార్యకర్తా కృషి చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. కాగా, ఈ ప్లీనరీ సమావేశంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, వచ్చే ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహాలపై చర్చలు సాగుతుండగా, పరిశీలకులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వరప్రసాద్, నారాయణస్వామి తదితరులు హాజరయ్యారు.